Monday, November 10, 2008

రెండు చేతులు

ఎముకలపై కేవలం చర్మం వేలాడుతున్న

ఓ ముదుసలి చేయి

నా ముందు చాపబడింది , దీనంగా.

పిండివేయబడుతున్న గుండెను నియంత్రించుకున్నా

ఏమీ చేయలేక

ఓ రూపాయి ఆ ఎముకలపై పెడుతూ .


ఎముకలే సరిగా ఏర్పడని

ఓ చిన్నారి చేయి

శాశ్వతంగా సూదులు పొడవడానికి ఏర్పరచిన అమరికతో

కదులుతోంది నా కళ్ళముందుగా .


ఈసారి

నన్ను నేను నియంత్రించుకోలేక పోయా .

అనిపించింది ,

నేను మంచి అని నమ్మే దేవుణ్ణి నరికిపోగులేయాలని.

ఆ సుకుమార చిన్నారి దేహాన్ని ఏ వ్యాధి తోనో హింసిస్తున్నందుకు.

Tuesday, September 16, 2008

ఎందుకో?

వేగంగా ఎగిరే కొంగను
ఒక్క దెబ్బతో నేలకూల్చగల
మా పల్లె పిల్ల వాళ్ళు
ఏ అభినవ్ బింద్రా నో కాలేరు.ఎందుకో?

ఒక్కసారి విని
ఏదైనా పాటను
అచ్చుగుద్దినట్టు పాడే
మా పల్లె చిన్నారి తెలివి
అర్ధంతరంగా
అత్తారింటికి పంపబడుతోంది , ఎందుకో?

పట్నం పిల్లల కంటే
అధిక శారీరక సామర్ధ్యం, అత్యంత నైపుణ్యం గల
నా పల్లె పిల్ల ముడి వజ్రాలు
సాన పెట్టబడి
జాతి వజ్రాలై మెరవడం లేదెందుకో?

Tuesday, September 9, 2008

ఆరాటం

ఒక లేత సన్నజాజి తీగె

రోజూ చూస్తూఉంటా దాని ఆరాటం .

దేనినో హత్తుకోవాలని ,

గట్టిగా చుట్టుకొని పైపైకి సాగాలని.

తన పిలుపే సరిగాలేదో లేక

తను కోరుకున్నవాటికి దీన్ని చేర్చుకునే ధైర్యం లేదో ,

ఇన్ని రోజులైనా

తను ఏ ఒక్క చెట్టునూ

తన బాహువులతో బంధించలేక

ఒంటరిగానే సాగుతోంది.

Saturday, August 23, 2008

ఆత్మీయ వాక్ సమీరం

హృదయాన్ని తాకి
అనంత ఆనందాన్ని
వర్షించగల ఒక స్వచ్చమైన
చల్లటి ఆత్మీయ వాక్ సమీరం,

కనీసం
రోజుకొకటి తగిలినా
జీవితమంతా ఆనందానుభవ
అమృత వర్షాలే కదా!

Saturday, July 26, 2008

ఆశ


ఆశ,

ఇంకా తెల్లగా కావాలని.


చూస్తాను.

"మేము మారుస్తాం"

అనే ప్రకటన

కొన్ని వందల సార్లు ఏదో టీవీ లో.


నిజమని నమ్మి కొంటూనే వుంటాను

ఒకసారి,రెండుసార్లు......కొన్నివందల సార్లు.

ఎప్పటికైనా మారుస్తుందేమో అని.


ఆపరేం

కొన్ని కోట్లమందిని

మోసగిస్తున్న ఈ ప్రకటనలని

ఎవరూ

ఎందుకు?

విజయం

విజయం

ఓటమి దగ్గరలో ఉండి
విజయం కోసం పోరాడుతున్న
ఏ జట్టును చూసినా నాకనిపిస్తుంది .
ఆ జట్టులో నేనుండాలని
దానిని విజయ తీరాలకు చేర్చాలని.

హింసింపబడుతూ
వేదన అనుభవిస్తున్న
ఏ ప్రాణిని చూసినా
నాకనిపిస్తుంది .
హింసించే వాళ్ళను
నేనెదుర్కోవాలని ,
ఆ ప్రాణికి
ఆనందాన్నీ,స్వేచ్చనూ పంచాలని.

అలా
అనిపించడమే కదా
విజయాలను సృజించే,
స్వేచ్చనూ,ఆనందాన్నీ పంచే
పనులకు మూలం.

Saturday, March 15, 2008

నా ప్రార్ధన

ఎవరన్నారు
మనిషి జీవితంలో
ప్రతి రోజుకు 24 గంటలేనని?

అందరి జీవితాలలోనూ
కొన్ని రోజులు క్షణాలు
కొన్ని రోజులు యుగాలు.
అందుకే
దేవుని ఎల్లప్పుడూ ప్రార్ధిస్తా ,
అందరికీ
అన్ని రోజులూ
క్షణాల్లా గడిచేలాచేయమని.

వంతెన నిర్మిద్దాం రా!

నీదీ , నాదీ ఒకే లక్ష్యం. కానీ మన మధ్య ఓ పెద్ద అగాథం. దానికి ఆ వైపున లక్ష్యం వైపు నువు నడుస్తున్నావ్, ఈ వైపున నేను నడుస్తున్న...