Thursday, August 1, 2019

వంతెన నిర్మిద్దాం రా!

Tuesday, April 21, 2015

పూదండ దారం

కళ్ళు తిప్పుకోనీయని అత్యద్భుత  అందం తో
సుదూరాలు వ్యాపించే  మైమరిపించే  పరిమళం తో
ఓ పూల దండ.
ఒద్దికగా కలిపి ఉంచబడిన వేర్వేరు రంగు పూలు
ప్రతి  దాని రంగూ  ప్రాముఖ్యంగా  కనిపించేలా,
స్వల్పమైన  విడి పూల సువాసనలన్నీ కలపబడి
అందరినీ మైమరిపిస్తున్న పరిమళం.
ఏన్నో మెచుకోళ్ళు
మరెన్నో గౌరవాలు ,ఆశ్చర్యాలు  ఆ పూదండపై.

హఠాత్తుగా ఓ రోజు  పూదండ దారం తెగిపోయింది .
ఒద్దికగా  ఉన్న పూలన్నీ చెల్లచెదురయ్యాయి.
కలిపిఉంచబడినప్పటి అందం కోల్పోయాయి.
అప్పటిదాకా  మైమరిపించిన పరిమళం స్వల్పమైపోయింది.
విడిపూల గౌరవం తగ్గిపోయింది.

పూలు మంచివి అవడమే కాదు,
వాటిని కలిపిఉంచే వారూ అతి ముఖ్యమే.
ఫూదండల పరిమళాలని పెంచడానికైనా,
 సమూహాలు ఏదైనా సాధించడానికైనా
 అన్నిటినీ కలిపిఉంచే ఓ సాధనం కావాలి.  

ఇదీ పూదండ దారం తెలిపిన ఓ సత్యం.


(నాయనమ్మ గుర్తుగా)
 (కిరణ్ శ్రీ రాం కు మరియు లీడర్స్ అందరికీ)






Wednesday, January 15, 2014

ఏదో చేయాలి !

ఎక్కడికో
తరలించుకపోబడుతున్న మన సహజ వనరులూ,
అక్రమంగా ఆక్రమింప బడుతున్న కాలువలు,చెరువులూ,
అభివృద్ది   కోసం నిర్ధాక్షిణ్యంగా   నరికివేయబడుతున్న   వందల ఏళ్ళ నాటి వృక్షాలు,అడవులూ, 
విలువపెంచుకోడానికే ప్లాట్లు గా మార్చబడి నిరర్ధకంగా ఉండిపోయే పొలాలూ, 
వర్షపు నీటిని భూమిలో ఇంకనివ్వని సిమెంట్ రోడ్లూ, ప్లాస్టిక్ వ్యర్ధాలూ
వ్యక్తిగతంగా ఎవరికీ నష్టాలుగా కనిపించని జాతీయ నష్టాలు.

అపుడపుడూ గుర్తొచ్చి భవిష్యత్తును చూపిస్తుంటాయ్. 
 ఏదో చేయాలి .

Sunday, December 30, 2012

అమ్మా! క్షమించు


అమ్మా!
క్షమించు నా దేశాన్ని
ఆడవాళ్ళకు స్వేచ్ఛను ఇవ్వలేని అరవై యేళ్ళ స్వతంత్ర దేశాన్ని.

క్షమించు నా ప్రజల్ని
చస్తున్నా చూస్తూ పోయే కొందరు స్వార్ధపరుల్ని.

క్షమించు కొందరు తల్లిదండ్రుల్ని
పిల్లలకు భారతీయ విలువలే నేర్పని వెధవల్ని.

క్షమించు నా దేశ విజ్ఞానాన్ని
నిను కాపాడుకోలేకపొయిన నా వైద్యవ్యవస్థని.

క్షమించు నా దేశ ప్రజా నాయకులను
బుద్దే లేని కొందరి వ్యాఖ్యలను ,దీన్ని కూడా రాజకీయం చేసే దిగజారుడుతనాన్ని.

క్షమించు నా సినిమాలను
బాధించడం వేధించడం గొప్పగా చూపేవాటిని.

క్షమించు నా దేశ ప్రచార మాధ్యమాల్ని
తప్పంటూనే తప్పుచేయడం నేర్పించే వాటిని, సంచలనాలను తప్ప విలువలే తెలుపని మాధ్యమాల్ని.

అమ్మా!
క్షమించు అని పైపైకి అంటున్నా నరికేయాలనే కోర్కెను అణుచుకుంటూ,
సిగ్గు పడుతున్నా నిందితుల్ని   ఇంకా శిక్షించలేకపోయిన  నా వ్యవస్థకై ,  
నిందితులు ఏ పరపతి కల వారి బిడ్డలో కాకూడదని కోరుకుంటున్నా.
భయంకరమైన శిక్షను ఈ క్షణమే  అమలుచేయాలని నినదిస్తున్నా.
నీ హత్యన్నా మరుగున పడిపోక
మా వ్యవస్థను మార్చుతుందని ఆశిస్తున్నా.








Tuesday, September 25, 2012

కొన్ని అందమైన పూలు



కొన్ని అందమైన పూలు.
అదే అందం,
అదే సొగసు
కలిగి వున్నాయ్ ఎప్పటినుండో.

ఎన్నో పొగడ్తలు,
మరెన్నో ఆరాధనా చూపులు వాటిపై.

వాటిలో
సృష్టించబడిన పనికి వాడబడి,
ఉపయోగపడి కూడా
అందాన్ని కాపాడుకుంటూ
నవ్వులతో జీవిస్తూ కొన్ని పూలు .

కేవలం వాడబడక
అందంగా ఉండిపోయి
నిశ్శబ్ధ నిట్టూర్పులతో బతుకీడుస్తూ కొన్ని పూలు.  

Friday, August 27, 2010

తిరస్కారం- పాఠం

ఆకాశం తిరస్కరించిందని
ఓ మేఘం
అతిగా కన్నీటిని వర్షిస్తూ
లోకం నుండి అదృశ్యమవ్వాలని
ప్రయత్నిస్తున్న క్షణంలో
నేననుకున్నాను "ఇంత పిచ్చా?" అని

కొండ కాదందని
అంతెత్తు నుండీ ఓ జలపాతం
దూకడానికి సిద్దమౌతున్న క్షణంలో
నేనను కున్నాను"అతి పనికి రాదు"అని.

కానీ
ఇపుడర్ధం అవుతోంది
అతిగా వాంచింపబడినదాని నుండి వచ్చే తిరస్కారం తో
మనసున కలిగే భావాలేంటో .

అయినా
తమ భావాలను నియంత్రించి
మేఘం ఓ చోట నేలనూ
జలపాతం
ఓ నదినీ జీవింపజేయడం చూసి
తెలుసుకున్నా ఓ పెద్ద జీవిత పాఠం

వంతెన నిర్మిద్దాం రా!

నీదీ , నాదీ ఒకే లక్ష్యం. కానీ మన మధ్య ఓ పెద్ద అగాథం. దానికి ఆ వైపున లక్ష్యం వైపు నువు నడుస్తున్నావ్, ఈ వైపున నేను నడుస్తున్న...